ఏపీకి గుడ్‌ న్యూస్‌ చెప్పి కేంద్రం.. చంద్రబాబు ఫుల్‌ ఖుషీ !

ఇప్పటికే మంజూరైన విజయవాడ–గూడూరు మూడో రైల్వేలైన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వంతెనలు, రెండు అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు..

Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన వారంలోపే కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గూడూరు–రేణికుంట మధ్య మూడో రైల్వేలైన్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైన్‌ను కేంద్రం నిర్మిస్తుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల దూరం ఉంది. దీని నిర్మాణానికి రూ.884 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరిస్తారు. ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

చివరి దశలో విజయవాడ– గూడూరు మూడో లైన్‌..
ఇదిలా ఉంటే ఇప్పటికే మంజూరైన విజయవాడ–గూడూరు మూడో రైల్వేలైన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వంతెనలు, రెండు అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. దక్షిణమధ్య రైల్వేలో గూడూరు–రేణిగుంట సెక్షన్‌ చాలా కీలకమైంది. గూడూరు నుంచి చెన్నైకి ఒక మార్గం, రేణిగుంట–తిరుపతివైపు మరోమార్గం ఉంది. చెన్నై–హౌరా ప్రధాన రైల్వేౖలైన్‌లో ఇది కీలకం. రేణిగుంట నుంచి చెన్నైవైపు, గుంతకల్లువైపు రెండు మార్గాలున్నాయి. గూడూరు నుంచి విజయవాడ, విశాఖ, కటక్‌ మీదగా హౌరా, విజయవాడ నుంచి ఖాజీపేట మీదుగా హైదరాబాద్‌ వైపు, విజయవాడ నుంచి ఖాజీపేట మీదుగా ఢిల్లీవైపు కీలక మార్గాలున్నాయి.

గూడూరులో పెరుగుతున్న రద్దీ..
మరోవైపు కీలకమైన గూడూరు జంక్షన్‌లో రైల్వే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారి అవసరాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల సంఖ్య పెంచుతోంది. దీంతో ట్రాఫిక్‌ ఎక్కువై చాలా రైళ్లను స్టేషన్‌ బయటే నిలిపివేయాల్సి వస్తోంది. క్రాసింగ్స్‌ కోసం కొన్ని స్టేషన్లలో నిలపాల్సి వస్తోంది. మూడోలైన్‌ పూర్తయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.